బోధకునిగా చేసే బోధలు నాకు బోధలు కావాలి
- Elisha Bonnke
- Nov 8, 2024
- 1 min read
కోరీ టన్ బూమ్(Corrie ten Boom 15Apr1892 - 15Apr1983) రచయితగా లిటరేచరులో దేవుని కొరకు వాడబడిన పరిచారకురాలు.
ఒకసారి ఆమె ఒక కూడికలో సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి అన్న వాక్యమును బోధించారు, ఆ కూడిక అనంతరం ఒక ఇంటికి భోజనము కొరకు ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించిన వారి ఇల్లు పదియవ అంతస్తులో ఉంది దానికి లిఫ్ట్ సౌకర్యము లేదు, 80సంవత్సరముల వయస్సులో పది అంతస్తులు ఒక్కొక్కటిగా ఎక్కుతు ఇక నేను ఇలా పైకి వెళ్లిపోవడమే ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నారట, అలా సణుగుకుంటూ పదియవ అంతస్తును చేరుకున్నారు. భోజనమునకు ఆహ్వానించిన కుటుంబములో అక్కా చెల్లెళ్లు మరియు వారి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు రక్షణ అనుభవం లేదు, ఆ రోజు ఆమె సువార్తను భట్టి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ సువార్తను అంగీకరించి రక్షణ పొందుకున్నారు.
ఎంతో సణుగుడుతో వెళ్లిన ఆమె తిరిగి పై నుండి క్రిందికి దిగుతు కోరీ గారు ఈ ప్రార్థన చేసారంట ప్రభువా కోరీ చేసే బోధలను పాటించే మనసును నాకు ఇవ్వండి అని.
సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని బోధించే నేనే అసహనముకు గురి అవ్వడము నేను బోధించే వాక్యమును అగౌరవపరిచినట్లయింది అని ఆమె ఒక పుస్తకంలో తను ఎదుర్కొన్న ఈ సందర్భమును వ్రాసారు.
రోమ2:21
ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?
1తిమోతి4:16
నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.
ఈ విధముగా దేవుడు కోరుకునే సారములో మనము సాగాలని ప్రార్థిస్తూ...


Comments