ఒక వ్యక్తికోసము ఇంతా...?
- Elisha Bonnke
- Nov 29, 2024
- 1 min read
అవును దేవునికి సంబంధించినవారికోసము దేవుడు ఎంతైనా చేస్తారు. ఎంతంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమముకు మించి కార్యము చేసేంతగా, అస్తమించాల్సిన సూర్యుడు ఒక రాత్రి గడిచిపోయినా అస్తమించనంతగా.
చాల విచిత్రములు సృష్టిలో మనము చూస్తుంటాము, వింటూవుంటాము, ప్రతీ విచిత్ర పరిస్థితులు మానవుని పట్ల దేవుడు కలిగియున్న చిత్తముతో ముడివేయబడి ఉన్నవి అని జ్ఞాపకం చేసుకుందాం.
చనిపోవలసిన హిజ్కియా దేవుని కృపను వేడుకొనుటవలన దేవుడు 15 సంవత్సరముల ఆయుస్సును అనుగ్రహించినప్పుడు, హిజ్కియా దానికి సూచనగా ఆహాజు మెట్ల గడియారం మీద ఉన్న నీడ పదిమెట్లు వెనకకి వెళ్లాలని అడిగాడు. అడిగిన ఈ ప్రక్రియ జరుగుటకు ఒక క్రమములో వెళ్తున్న భూమి మరియు సృష్టి సర్దుకోవలసివచ్చింది. 2రాజులు 20:9తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా?
ఇంచుమించు ఒకనాడెల్లా సూర్యుడు అస్తమించని కార్యము యెహోషువ ప్రార్థనకు జవాబుగ దేవుడు ఇచ్చారు. యెహోషువ10:12,13యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒకనాడెల్ల అస్తమింప త్వరపడలేదు.
ఒకనాడెల్ల సూర్యుడు అస్తమించకుండా ఉండాలి అంటే సృష్టిలో ఏమి జరగాలో ఆలోచించాలి.దేవుడు ఎదైనా ఆయన పిల్లలకొరకు జరిగించగలరు.
యెహోషువ10:14యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఇప్పుడు ఉన్న సాంకేతిక ఙ్ఞానము ఆ దినాలలో ఉంటే శాస్త్రవేత్తలు ఈ వార్తను భట్టి అలజడిని సృష్టించేవారేమో...
ఈ సృష్టిలో మనకి ఇంతటి ప్రాముఖ్యతను ఇస్తున్న దేవున్ని కలిగియున్న మనము ధన్యులము.
కీర్తనలు 126:3 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి.
లూకా 1: 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. .
నీ కోసం తన కుమారునే అర్పణగా ఇవ్వగా.. నీ కోసం మరి ఏ విషయములో అయినా కార్యమును జరిగింపరా?
Elisha Bonnke.



Comments